ప్రతిపక్షవాతం....

ఎన్నో
చేసేయాలని,
రాసేయాలనీ,
కూసేయాలనీ,
ఉత్సాహానికి ఊపిరిపోస్తూ,
అనుకూలించని కాలానికి,
ప్రతికూల ప్రపంచానికి,
ఎదురీదుతూ నా అమాయకత్వం;

గెలుపు దొంగా పోలీసాట ఆడుతుంది,
ఓటమి మా ఇంట్లో అద్దెకుంటుంది,
కడుపు నిండేంతగ తింటున్నా
దెబ్బలకు మాత్రం మొహం వాయట్లేదు;

ఓదార్పనేమాట బహు దూరం,
నమ్మకం నవ్వులాటైపోయింది,
నా స్పర్శకి నాకే కంపరమేస్తుంటే,
నావాళ్ళ నుంచి వేరింకేమి ఆశించనూ;

సమాధానం చెప్పుకోలేని
ప్రతీ ప్రశ్న చేతిలొ నేను ఓడిపోతున్నాను,
నిత్య సమాధినైపోతున్నాను
క్షణానికి,
నిమిషానికి,
ఘడియకి,
గంటకి,
బదులుపడలేక,
కాలంనుంచే మొహంచాటేసి తిరుగుతున్నాను;

ప్రేమించలేకపోతున్నాను,
గుత్తులు గుత్తులగా గుర్తులున్నా,
గుబాళించలేకపోతున్నాను…
ఈ మర ప్రపంచానికి
వత్తాసు పాడే వ్యాపకంలో,
నేను ఉన్న సమయాన కూడా
కాలక్షేపాన్ని కాలేకపోతున్నాను
తోడుకాలేకపోతున్నాను,
ఈడుకి జోడుకాలేకపోతున్నాను;

పక్షానికో ప్రక్షాళన
అవసరమైపొఓయింది ఆలోచనలకి,
కన్నీరుతోనైనా,
పన్నీరుతోనైనా,
పురి విప్పిన ఙ్యాపకాలతోనైనా సరే....

Comments

Popular posts from this blog

తపన....

అపర బ్రహ్మలా...

అపర బ్రహ్మలా...