Posts

అపర బ్రహ్మలా...

మాటల్లోకి మారని భావం, చేతల్లోకి చేరని చింతన, సాంద్రతలేని ఆర్ద్రత, ఊరటనివ్వని స్వాంతన, ఏకాంతాన్ని తరమని తోడు, నీ, నా తనాలు నిండున్న స్వార్ధాన్ని మీరి మనిషిలా బ్రతకాలనుంది... ప్రశ్నలకి ప్రాణం పోయలేని, వెన్నులా నిటారుగా నిలబడలేని, కాలాన్నే నిలదీసి అడిగలేని, నిజాలకి అద్దం పట్టలేని, నిస్సహాయతని దాటి ధైర్యంగా చూడాలనుంది... రాయాలనుంది ఊరికే అలికినట్టు కాదు చెరగని శిలాక్షరాలను విరగ రాయాలనుంది... నడకతెలియని మార్పుకి అడుగులెయ్యడం నేర్పించినట్టు, మగతలో ఉన్న చైతన్యానికి కళ్ళు విప్పి చూపిచ్చినట్టు, తరతరాలుగా తుప్పుపడ్డ తేజాన్ని కడిగారేసినట్టు, రాయాలనుంది... రాయగలగాలే కానీ, ఉవ్వెత్తున ఎగిసిన ఆవేశానికి, ప్రతీ మనస్సూ కాగితమే... కాయగలగాలేకానీ, ఎగసిన ఆవేశాన్ని మోసే, ప్రతీ మస్తకమూ కలమే... కలాన్నై, కాగితాన్నై రాసుకున్న వస్తువునై, తెలుసుకున్న తత్వాన్ని కవిత్వాన్నైపోవాలనుంది, అపర బ్రహ్మలా...

అపర బ్రహ్మలా...

రాయగలగాలే కానీ, ఉవ్వెత్తున ఎగిసిన ఆవేశానికి, ప్రతీ మనస్సూ కాగితమే, రాయాలి, శిలాక్షరాలను రాయాలి, రాస్తే మార్పుని రాయాలి, మార్పు తెచ్చే చైతన్యాన్ని రాయాలి, తుప్పుపడ్డ తేజాన్ని కడగాలి, కాలాన్నే కడిగెయ్యాలి.... కలాన్నై, కాగితాన్నై, కవిత్వాన్నై....

రాతలోడిలా...

రాద్దామని, ఏదో చేద్దామని, ఎడం చేత్తో కాగితాన్ని, కుడి చేత్తో కలాన్ని పట్టుకున్నాను, ఆపర బ్రహ్మలా...!!!!

ఆశావాది...

ఆలోచిస్తేనే వచ్చే కష్టాలన్నీ, ఆరాతీస్తేనే అంతరార్ధాల లోతు తెలిసేది, చూపుకన్నా ఎక్కువగా కష్ట పడిపోతుందీమధ్య ఆలోచన, అలుపన్న మాటనట్లేదసలు నిదురలోనైనా, సూటిగా చూసి ఆలోచించాలో, ఆలోచించి చుడాలో అర్ధంకాట్లేదు, ప్రతీ ఉదయం, నేను కళ్ళు విప్పుతున్నానా, లేక పగలు తన చేత్తో నా కంటి కిటికీలు తెరుస్తుందా, నేను నడుస్తున్నానా, లేక కాలం తన వేగంతో పాటుగా తూసుకుంటూ వెల్లిపోతొందా, ఊహ సీమించబడినట్టూ, స్వేచ్చ బంధించబడినట్టూ, తనువు మట్టన్నట్టు, కాలి బూడిదయ్యే సిగరట్టన్నట్టు, ఆ పైవాడు ఏం తోచకపోతే, పిచ్చి గీతలు, రాతలు రాసుకోడానికే తయారు చేసుకున్న చిత్తు కాగితమన్నట్టు, ఆలోచిస్తుంటే ఇలా ఎన్నో ఉపమానాలు, నా అసహాయ స్థితిని వర్ణించేందుకు.... అర చేతిలో ఉన్న నాణనికి, ఒక పక్క అనుకూల ఈంకో పక్క ప్రతికూలాచనలు, సావకాశంగా తేల్చుకునే సమయం లేదు, నెగటివిటీ షుగ"రొచ్చి వగరైపోయిన ఆలోచనలకి ఆరారా పోజిటివిటీ అనే ఇన్సులిన్ ఇస్తే కాని ఇక బ్రతకడం కష్టమైపొయింది....

ప్రతిపక్షవాతం....

ఎన్నో చేసేయాలని, రాసేయాలనీ, కూసేయాలనీ, ఉత్సాహానికి ఊపిరిపోస్తూ, అనుకూలించని కాలానికి, ప్రతికూల ప్రపంచానికి, ఎదురీదుతూ నా అమాయకత్వం; గెలుపు దొంగా పోలీసాట ఆడుతుంది, ఓటమి మా ఇంట్లో అద్దెకుంటుంది, కడుపు నిండేంతగ తింటున్నా దెబ్బలకు మాత్రం మొహం వాయట్లేదు; ఓదార్పనేమాట బహు దూరం, నమ్మకం నవ్వులాటైపోయింది, నా స్పర్శకి నాకే కంపరమేస్తుంటే, నావాళ్ళ నుంచి వేరింకేమి ఆశించనూ; సమాధానం చెప్పుకోలేని ప్రతీ ప్రశ్న చేతిలొ నేను ఓడిపోతున్నాను, నిత్య సమాధినైపోతున్నాను క్షణానికి, నిమిషానికి, ఘడియకి, గంటకి, బదులుపడలేక, కాలంనుంచే మొహంచాటేసి తిరుగుతున్నాను; ప్రేమించలేకపోతున్నాను, గుత్తులు గుత్తులగా గుర్తులున్నా, గుబాళించలేకపోతున్నాను… ఈ మర ప్రపంచానికి వత్తాసు పాడే వ్యాపకంలో, నేను ఉన్న సమయాన కూడా కాలక్షేపాన్ని కాలేకపోతున్నాను తోడుకాలేకపోతున్నాను, ఈడుకి జోడుకాలేకపోతున్నాను; పక్షానికో ప్రక్షాళన అవసరమైపొఓయింది ఆలోచనలకి, కన్నీరుతోనైనా, పన్నీరుతోనైనా, పురి విప్పిన ఙ్యాపకాలతోనైనా సరే....

తపన....

కవిత్వం ఎండిపోయిందో, సాగరం ఇంకిపోయిందో, భావాలు నిండుకున్నాయో, తృష్ణ తరించిపోయిందో, రాయాలనున్నా పాళి తాకిడికి కాగితం తడవట్లేదు, రసవత్తరంగా కలం నరాలలో ప్రవహించాల్సిన రక్తం పల్చపడింది, సిరా అప్పుకావాలి, మరోసారి నింపుకోవాలి, అకాశం వైపుగా నోరు చాచి వేచి ఉన్నాను, చినుకు చుక్క రాలుతుందేమోనని…. మేఘం రాల్చెళ్ళిన ఆ తడి లేఖ, పెదవంచున స్వర్గంలా అవతరించింది… - శ్రీవాహిని

తీరం...

జననాలన్నీ, మరణాలన్నీ, జగమే మరిచిన కలనాలన్నీ, చరణాల్లేని పల్లవులన్నీ, చలనాల్లేని చరణాలేన్నీ, గమ్యాల్లేని గమనాలన్నీ, చేరే తీరం నేనైపోనా ?!!!... మంచి, సంచి, కంచి, నేనైపోనా ?!!!....