అంతర్మధన....2

మౌనం, మనస్సు మలిచే
మధుర మరీచిక,
ఆలోచన, రగిలిన మేధకి
రోజుకో భూమిక,
మనిద్దరి చూపుల మధ్య,
నాలుగు లోకాలున్నాయి,
నా కళ్ళతో చూసే నీ లోకం,
నా కళ్ళతో చూసే నా లోకం,
నీ కళ్ళతో చూసే నీ లోకం,
నీ కళ్ళతో చూసే నా లోకం,
ఒక్క చిత్రానికి, చిత్రవర్ణానికి,
నాలుగు అర్ధాలున్నాయి...
మడిచి చూస్తే, ఒకటి,
మలిచి చూస్తే, ఇంకొకటి,
ఎదురెదురుగా ఉన్న అద్దాల్లో,
కోటి ప్రతిబింబాలున్నట్టు,
తిప్పి చూస్తే, తరచి చూస్తే,
మరి కొన్ని కధలున్నాయి...
ఏది నిజమో, ఏది భ్రమో,
అసలెదో, కొసరేదో,
తేల్చుకోలేని పరిస్థితి ప్రతీ క్షణం
పలకరిస్తూ ఉంటుంది....
నిశ్శబ్ధమే నిట్టూర్పు విడిచేంత నిర్లిప్తత
అనవరతం వెంటాడుతూ ఉంటుంది...

తప్పొప్పుల తర్జుమాలో,
యధావిధిలో, హడవడిలో,
జీవిత సారం పలచబడిపోతూ ఉంది....

Comments

Popular posts from this blog

తపన....

అపర బ్రహ్మలా...

అపర బ్రహ్మలా...