Posts

అపర బ్రహ్మలా...

మాటల్లోకి మారని భావం, చేతల్లోకి చేరని చింతన, సాంద్రతలేని ఆర్ద్రత, ఊరటనివ్వని స్వాంతన, ఏకాంతాన్ని తరమని తోడు, నీ, నా తనాలు నిండున్న స్వార్ధాన్ని మీరి మనిషిలా బ్రతకాలనుంది... ప్రశ్నలకి ప్రాణం పోయలేని, వెన్నులా నిటారుగా నిలబడలేని, కాలాన్నే నిలదీసి అడిగలేని, నిజాలకి అద్దం పట్టలేని, నిస్సహాయతని దాటి ధైర్యంగా చూడాలనుంది... రాయాలనుంది ఊరికే అలికినట్టు కాదు చెరగని శిలాక్షరాలను విరగ రాయాలనుంది... నడకతెలియని మార్పుకి అడుగులెయ్యడం నేర్పించినట్టు, మగతలో ఉన్న చైతన్యానికి కళ్ళు విప్పి చూపిచ్చినట్టు, తరతరాలుగా తుప్పుపడ్డ తేజాన్ని కడిగారేసినట్టు, రాయాలనుంది... రాయగలగాలే కానీ, ఉవ్వెత్తున ఎగిసిన ఆవేశానికి, ప్రతీ మనస్సూ కాగితమే... కాయగలగాలేకానీ, ఎగసిన ఆవేశాన్ని మోసే, ప్రతీ మస్తకమూ కలమే... కలాన్నై, కాగితాన్నై రాసుకున్న వస్తువునై, తెలుసుకున్న తత్వాన్ని కవిత్వాన్నైపోవాలనుంది, అపర బ్రహ్మలా...

అపర బ్రహ్మలా...

రాయగలగాలే కానీ, ఉవ్వెత్తున ఎగిసిన ఆవేశానికి, ప్రతీ మనస్సూ కాగితమే, రాయాలి, శిలాక్షరాలను రాయాలి, రాస్తే మార్పుని రాయాలి, మార్పు తెచ్చే చైతన్యాన్ని రాయాలి, తుప్పుపడ్డ తేజాన్ని కడగాలి, కాలాన్నే కడిగెయ్యాలి.... కలాన్నై, కాగితాన్నై, కవిత్వాన్నై....

రాతలోడిలా...

రాద్దామని, ఏదో చేద్దామని, ఎడం చేత్తో కాగితాన్ని, కుడి చేత్తో కలాన్ని పట్టుకున్నాను, ఆపర బ్రహ్మలా...!!!!

ఆశావాది...

ఆలోచిస్తేనే వచ్చే కష్టాలన్నీ, ఆరాతీస్తేనే అంతరార్ధాల లోతు తెలిసేది, చూపుకన్నా ఎక్కువగా కష్ట పడిపోతుందీమధ్య ఆలోచన, అలుపన్న మాటనట్లేదసలు నిదురలోనైనా, సూటిగా చూసి ఆలోచించాలో, ఆలోచించి చుడాలో అర్ధంకాట్లేదు, ప్రతీ ఉదయం, నేను కళ్ళు విప్పుతున్నానా, లేక పగలు తన చేత్తో నా కంటి కిటికీలు తెరుస్తుందా, నేను నడుస్తున్నానా, లేక కాలం తన వేగంతో పాటుగా తూసుకుంటూ వెల్లిపోతొందా, ఊహ సీమించబడినట్టూ, స్వేచ్చ బంధించబడినట్టూ, తనువు మట్టన్నట్టు, కాలి బూడిదయ్యే సిగరట్టన్నట్టు, ఆ పైవాడు ఏం తోచకపోతే, పిచ్చి గీతలు, రాతలు రాసుకోడానికే తయారు చేసుకున్న చిత్తు కాగితమన్నట్టు, ఆలోచిస్తుంటే ఇలా ఎన్నో ఉపమానాలు, నా అసహాయ స్థితిని వర్ణించేందుకు.... అర చేతిలో ఉన్న నాణనికి, ఒక పక్క అనుకూల ఈంకో పక్క ప్రతికూలాచనలు, సావకాశంగా తేల్చుకునే సమయం లేదు, నెగటివిటీ షుగ"రొచ్చి వగరైపోయిన ఆలోచనలకి ఆరారా పోజిటివిటీ అనే ఇన్సులిన్ ఇస్తే కాని ఇక బ్రతకడం కష్టమైపొయింది....

ప్రతిపక్షవాతం....

ఎన్నో చేసేయాలని, రాసేయాలనీ, కూసేయాలనీ, ఉత్సాహానికి ఊపిరిపోస్తూ, అనుకూలించని కాలానికి, ప్రతికూల ప్రపంచానికి, ఎదురీదుతూ నా అమాయకత్వం; గెలుపు దొంగా పోలీసాట ఆడుతుంది, ఓటమి మా ఇంట్లో అద్దెకుంటుంది, కడుపు నిండేంతగ తింటున్నా దెబ్బలకు మాత్రం మొహం వాయట్లేదు; ఓదార్పనేమాట బహు దూరం, నమ్మకం నవ్వులాటైపోయింది, నా స్పర్శకి నాకే కంపరమేస్తుంటే, నావాళ్ళ నుంచి వేరింకేమి ఆశించనూ; సమాధానం చెప్పుకోలేని ప్రతీ ప్రశ్న చేతిలొ నేను ఓడిపోతున్నాను, నిత్య సమాధినైపోతున్నాను క్షణానికి, నిమిషానికి, ఘడియకి, గంటకి, బదులుపడలేక, కాలంనుంచే మొహంచాటేసి తిరుగుతున్నాను; ప్రేమించలేకపోతున్నాను, గుత్తులు గుత్తులగా గుర్తులున్నా, గుబాళించలేకపోతున్నాను… ఈ మర ప్రపంచానికి వత్తాసు పాడే వ్యాపకంలో, నేను ఉన్న సమయాన కూడా కాలక్షేపాన్ని కాలేకపోతున్నాను తోడుకాలేకపోతున్నాను, ఈడుకి జోడుకాలేకపోతున్నాను; పక్షానికో ప్రక్షాళన అవసరమైపొఓయింది ఆలోచనలకి, కన్నీరుతోనైనా, పన్నీరుతోనైనా, పురి విప్పిన ఙ్యాపకాలతోనైనా సరే....

తపన....

కవిత్వం ఎండిపోయిందో, సాగరం ఇంకిపోయిందో, భావాలు నిండుకున్నాయో, తృష్ణ తరించిపోయిందో, రాయాలనున్నా పాళి తాకిడికి కాగితం తడవట్లేదు, రసవత్తరంగా కలం నరాలలో ప్రవహించాల్సిన రక్తం పల్చపడింది, సిరా అప్పుకావాలి, మరోసారి నింపుకోవాలి, అకాశం వైపుగా నోరు చాచి వేచి ఉన్నాను, చినుకు చుక్క రాలుతుందేమోనని…. మేఘం రాల్చెళ్ళిన ఆ తడి లేఖ, పెదవంచున స్వర్గంలా అవతరించింది… - శ్రీవాహిని

తీరం...

జననాలన్నీ, మరణాలన్నీ, జగమే మరిచిన కలనాలన్నీ, చరణాల్లేని పల్లవులన్నీ, చలనాల్లేని చరణాలేన్నీ, గమ్యాల్లేని గమనాలన్నీ, చేరే తీరం నేనైపోనా ?!!!... మంచి, సంచి, కంచి, నేనైపోనా ?!!!....

మార్పు...

ఒక పగలు ఒక సాయంత్రం... తొడుగా నేను నడుస్తున్నాను... పైన ఆకాశం...కింద నేల... మూడొంతులు పైనే ఉన్నాను... నడక వాలకం ఏడ్చినట్టే ఉంది.... ఎందుకంటే... గమ్యమే లేదో... దృష్టి గమ్యం పైన లేదో... అన్నది అర్ధం కావట్లేదు... పగలు ఊహల్లో, రాత్రి కలల్లో, నివాసమైపోతుంది, వాస్తవాన్ని ధరించట్లేదు, భరించట్లేదు... నన్ను నేను ఇష్టమంత ఇష్టపడుతున్నాను, కాని నన్నెవ్వరూ నచ్చుకోవట్లేదు... సోమరినట... రావాల్సిన మార్పనేదేదో నాకు నచ్చినట్టుకాకుండా, పక్కవాళ్ళకి నచ్చినట్టే ఎందుకు ఉండాలి ?

మజిలీ...

నేను నేనంటూ తాపత్రయపడే స్వార్ధం మనిషిని నడిపిస్తూ ఉంటుంది.. అది కిందకి దిగి, వెంట జారుస్తుంది... ఒక చోట అహంగా, మరో చోట అన్యాయంగా, ఒక వైపు అక్రమంగా, ఇంకో వైపు అబద్దంగా, బహు రూపి బాటసారిగా, ఆడిస్తూ ఉంటుంది... అనుసరిస్తే, అనుభవిస్తుంది... అదంతా, కధంతా, అది చేరే వరకే, కడ చేర్చే వరకే... మేను, నేను లేను అనే క్షణమే, అర్ధాలకు ఉనికే ఉండదు... వివరాలకి మజిలీలుండవు...

ఆలోచిస్తే...

గెలుపైనా, మలుపైనా, సొంతమయ్యేది, వాలిన వాటిక్కానీ, రాలిన వాటిక్కావు.... ఎందు"కంటే, మోకాళ్ళ మధ్య వాలిన ఆలోచన, ఒక పొద్దుకి సాక్ష్యం, ఒక సంధ్యకి ఆసరా, ఒక రేయికి నిదర్శనం....

SixSigma జీవితం ....

ప్రతీ క్షణంలోకి తొంగి చూసి సిక్ష్ సిగ్మా కంఫర్మిటీ ఉంటేకానీ కలాన్ని ముందుక్కదల్చని (ఆనందపు)క్వాలితీ కంట్రోల్ పద్దతిని అనుసరించాలని అవలంబించాలనుంది... బహుశా అప్పుడు జీవితాన్ని, స్వర్గం అనొచ్చేమో, కనీసం పోల్చుకోవచ్చేమోననిపిస్తుంది.... ప్రయత్నించి చూస్తే పోలే....!!! ;)

ప్రీతి ప్రతి...

చెప్పాలి, చేరాలి, కదలాలి, నిను కలవాలి... అని పలికే నాలోని భావ ప్రాణాలు.... అణువనువు ఆరాధిస్తూ, అడుగడుగూ ఆరాతీస్తూ, కదిలెళ్ళే పయనం నీకై, చిరునవ్వుల గమ్యం నీవై, చిగురాకుల పచ్చదనాన్ని, చిగురాశల తెల్లదనాన్ని, రంగరించి రంగుపంచిన, అనురాగపు ఆమని రాగం నీది.... నాతో మొదలై నీతో ముగిసిన ప్రతీ జన్మ సరికొత్త కారణం..... నాలో ఎగసి నీలో సమసిన ప్రతీ శ్వాస ఆత్మీయ రుణం....

గతి..

ఒకప్పుడు మా పై పోర్షనులోనే అద్దెకుండేది వెలుగు... నాకు మంచి పరిచయమే.... తొక్కలోది రెసెష్సన్ వేడి తట్టుకోలేక, ఖాళీ చేసెళ్ళిపోయింది... ఊరకుండక, కక్కుర్తికిపోయీ, బ్రతుకు తెరువుకిపోయీ చీకటికి చోటిచ్చాను... అదేం చొరవొకాని... కాస్తైనా ఖాళీని నాకంటూ ఉంచకుండా పూర్తి కబ్జా చేసేసింది.... ఇవాల్టి అయోమయంలో నిలువనీడకు మొహంవాచిన నా మొహం ఒక పక్క, దిష్టి బొమ్మలా పరిస్తితులను కాపలా కాస్తూ కుర్చున్న నా ఆషాజ్యోతి మరోపక్క, సందిట్లో సడేమియా అన్నట్టు, మాటమాటకి, మాటిమాటికీ గతం సందులోకెళ్ళొస్తూ, జేబులు సర్దుకొచేస్తున్నాయి, నా ఆలోచనలు, తెలియనివి ఏవీ లేవు, మరిచిపోయి కొన్ని... మడిచిపోయి కొన్ని... వాటిట్లో, అన్నిట్లో, వాకిట్లో, దాపరికాలెన్నో? దారికాపలాలెన్నో...?

చరమ"రణం"....

ఆ"కలికి" నేల కడుపు జ్వలిస్తే, దాహానికి వేర్లన్నీ నొర్లు తెరిస్తే, ప్రకృతి పడి ఒళ్ళు విరిస్తే, బతుకు చితికి చితులు వెలిస్తే, ఏ భావం జన్మిస్తుంది, ఏ కవనం ప్రభవిస్తుంది, ఏ రాగం రుచినిస్తుంది, ఏ రక్తం రుణమౌతుంది, ప్రాణమే ప్రవాస సారంశం నవ చరణం చరమ"రణం"....

అచంచల చలనం!

నటిస్తున్న ప్రతీ పదం, బుకాయిస్తూ ప్రతీ శ్వాస, నా తనాన్ని, అస్థిత్వాన్ని, అబద్ధీకరిస్తున్న నా లౌక్యం, అఙ్ఞ్యానతత్వం ప్రొద్దుతోపాటుగా, కళ్ళు నలుపుకుంటూ లేస్తున్న, ఆశలు, గమ్యాన్ని జేబులో వేసుకుని మోసుకెళ్తున్న, తాపత్రయాలు, వాలిన సాయంత్రనికి మోకాళ్ళ మధ్య తల వాలుస్తున్న, ఆలోచనలు, అరచేతిలో బద్ధకం, అరికాలికింద స్వర్గం, సాధించింది లేదని కాదు, ప్రగతి శూన్యమనీ కాదు, మరీ గొంగళితో పోల్చలేం కాని, ట్రెడ్మిల్లుపై పరుగులా ఉంది, జీవితం...

తృష్ణ గీతి.......

ఎన్నో ప్రశ్నలు, ఎన్నో తృష్ణలు, హారతి పళ్ళెపుటంచులలో, తలుపుల గొళ్ళెపుటిరుసులలో, చెక్కల తొక్కల దిక్కులులలో ఋక్కులలో..... ఎన్నో తృష్ణలు, ఎన్నో ప్రశ్నలు, వృష్టికి ఇచ్చిన అశ్రువులో, విచ్చిమోసిన గొంతుకలో, ఆరని గుండెల మంటలలో, గణ గణ గణ గణ గంటలలో..... లోకంలో, శోకంతో, చలించి, జ్వలించె, రణరంగాలు, గణరంగాలు, ముస్తాబయ్యే శ్రీరంగాలా కుదురే అరుదు, భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం, సమాధానాల జాడలు లేవు, నాలుగువైపుల సమిధల చితులే; కదం తొక్కుతూ, పదం పాడుతూ, అమాయకంగా, అయోమయంలో, వెతుకులాటలో, బ్రతుకు పాటలో, తోపులాటలో, పరుగు బాటలో, నలిగే, చితికే ప్రతీ మనస్సులో, తీరని ఆకలి, నెత్తుటి లోగిలి, ప్రత్యక్షరం, ప్రతీ క్షణం, ఆహ్వానాలు, ఆరోహణలు, కాలం మెచ్చే మార్పులకోసం, మార్పులు తెచ్చే రోజులకోసం, ప్రశ్నల తృష్ణలు, మరో ప్రపంచపు, మహా ప్రపంచపు, ప్రస్తావనలు, ప్రస్థానాలు....... - శ్రీవాహిని

కుస్తీ....

జీవితం కాస్త జబ్బుపడినట్టుంది, మనస్సు కాస్త మబ్బుపడినట్టుంది, ఉదయించిన వేకువతో లేవని బద్ధకం, మదించిన మధ్యాహ్నంతో భుజం కలపని ఆయాసం, వాలిన సాయంత్రాన్ని సాగనంపాలని లేని నిరుత్సాహం, రాలిన చీకటి తెరలను తడుముకుంటూ ఆవులింత..... ఊహల్ని మాత్రమే పరిపాలిస్తున్న ఉత్సాహం ఒకపక్క, వాస్తవ వాకిట్లో చేరి మతిని పోషించకుంది...... ఒటమిలో పడి దేవులాడుతున్న దినాంకము మాటున, గెలుపు తన పరిచయమే దాచి, ఉనికి కోల్పోయినట్టుంది.... అలవాటైపోయిన అసహాయత, కలపాటైపోయిన ఆశలవాయిదా, వెలుగుతో రుణం తీరిపోయిన్నట్టుంది...... శ్వాస క్రియే సమరమైపోయినట్టుంది...... - శ్రీవాహిని

నా"నోలు" ....

1) డబ్బు, దేవుడు, మనిషి, కుక్క..... 2) తెల్ల గుడ్డల, రాజకీయ లొల్లి, దేశం వొంటిమీద, మచ్చల బొల్లి.... 3) నేల ప్రమిద, గాలి నూనె, మనసు మొలకెత్తితే, అది దీపం.... 4) కొడవలి, వంగింది, కాళ్ళని చూస్తుందా.... పదునే పోయిందా....

నా 'నోలు'....

1) మాత్ర, యాత్ర, కూత, కోత... 2) వయాగ్రా మాత్ర, స్వర్గానికి యాత్ర, వేకువ కోడి కూత, నీ సంతోషానికి కోత....

నా 'నోలు'....

పాల పాకెట్టులు, హీరోయిన్ జాకెట్టులు, పని ఇక్కట్టులు, సెలవ్ కై పాట్లు.... ఎంత రాసిన, సిరా ఆరదు, నీలి రంగు, సాగరం..... పదం, కదం, అయోమయం జగన్నాధం... డాక్టర్ మందు బిళ్ళ, నీ చేతికి చిప్ప, ఎరా రాంపండు, ఇది ఏం ధర్మం....